రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ (Meteorological Department) చల్లని కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మీదుగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon Winds) చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలోనే రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు వేగంగా విస్తరించాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం (Visakhapatnam Meteorological Centre) వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు (నేడు, రేపు) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ జిల్లాలకు ‘ఎల్లో అలెర్ట్’..
రుతుపవనాల గమనం చురుగ్గా ఉండటంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కింది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow Alert) (Yellow Alert) జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు (Sri Potti Sriramulu Nellore District) ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
రుతుపవనాల ప్రభావం రేపు కూడా బలంగా కొనసాగనుంది. రేపు ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున, కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బలమైన ఈదురు గాలులు, పిడుగులు పడే ప్రమాదం, కొన్ని చోట్ల ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.








