భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది, ఇది 25 గంటల పాటు కొనసాగుతుంది.
పీఎస్‌ఎల్‌వీ సీ60 ప్రత్యేకతలు..
పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్ 44.5 మీటర్లు ఎత్తు ఉండగా, 229 టన్నుల బరువుతో ప్రయోగం చేపట్టనున్నారు. ఇది పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 62వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ దశతో చేయబడుతున్న 18వ ప్రయోగం. ఇంతకు ముందు ఈ సిరీస్‌లో 59 విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి.
ఈ రాకెట్ నాలుగు దశలతో పనిచేస్తుంది. మొదటి దశ ఘన ఇంధనం, రెండో దశ ద్రవ ఇంధనం, మూడో దశ ఘన ఇంధనం, నాలుగో దశ ద్రవ ఇంధనంతో ఈ రాకెట్ ప్రయోగిస్తారు. భవిష్యత్‌కు ఉపయుక్తం కోసం ఈ ప్రయోగంలో ఇస్రో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వీటికి ఛేజర్, టార్గెట్ అనే పేర్లు పెట్టారు. ఒక్కో ఉపగ్రహం 440 కిలోల బరువుతో ఉంటుంది. వీటిని స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్ష ప్రయాణం వంటి ప్రయోగాలకు ఉపయోగిస్తారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 కోసం అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో వెల్లడించింది.