అనంత టీడీపీలో ముసలం.. ఎమ్మెల్యే వ‌ర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే

అనంత టీడీపీలో ముసలం.. ఎమ్మెల్యే వ‌ర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే

అనంతపురం అర్బన్ నియోజకవర్గ (Anantapur Urban Constituency) తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party) అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad), మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి (Vaikuntam Prabhakar Chowdary) వర్గాల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ (Cold War) ఇప్పుడు బహిరంగ విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన ఘాటు ఆరోపణలు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

ఆనాడు సీటు త్యాగం చేశా..
గత సార్వత్రిక ఎన్నికల (2024) సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం తాను అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్‌ను (TDP Ticket) త్యాగం చేసిన విషయాన్ని ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు. ఆ సమయంలో తాను సీటు వదులుకుంటే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ (MLC) లేదా రాజ్యసభ (Rajya Sabha) స్థానం ఇస్తానని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా తనకు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. అయితే ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ సీట్ల (Rajya Sabha Seats) హ‌డావిడి న‌డుస్తుండ‌డంతో మాజీ ఎమ్మెల్యే త‌న మ‌న‌సులోని కోరిక‌ను చెప్ప‌క‌నే చెప్పారు.

ద‌గ్గుపాటి ప్రసాద్ ఉంటాడో.. పోతాడో
ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీరుపై ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నియోజకవర్గంలో నా వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా అణచివేతకు పాల్పడుతున్నారు. పదవులు శాశ్వతం కాదనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున భూకబ్జాలు (Land Encroachments) జరుగుతున్న మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అంగీకరించడం గమనార్హం.

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో సాగుతున్న అరాచకాలు, కబ్జాల వ్యవహారాలన్నింటినీ ఆధారాలతో సహా ఇప్పటికే టీడీపీ(TDP) అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని, ఆయనపై పార్టీ పెద్దలు కఠిన చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని కూడా ప్రభాకర్ చౌదరి(Prabhakar Chowdary) ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో తాను అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అయితే, రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరిగితే.. కచ్చితంగా మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఈ స్థాయి విభేదాలు రచ్చకెక్కడం, సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే మాజీ ఎమ్మెల్యే కబ్జా ఆరోపణలు చేయడం అనంతపురం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment