త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 5,023 ఫిర్యాదులు అందాయని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా చెరువులు, కుంటలను ఆక్రమణలను గుర్తిస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, చెరువుల పునరుద్ధరణ కోసం డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. “హైడ్రా కూల్చివేతలు ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది. ఎఫ్‌టీఎల్ గుర్తింపు తర్వాత కూల్చివేతలు తిరిగి మొదలవుతాయి” అని స్పష్టం చేశారు.
FTL, కబ్జాలు, ప్రజల భద్రతపై కీలక సూచనలు
“హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ఎఫ్‌ఎమ్ ఛానెల్ ప్రారంభించబోతున్నాం” అని చెప్పిన రంగనాథ్, ప్రభుత్వ మరియు ప్రజల భూములపై కబ్జాలు జరిగినప్పుడు హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. “కొత్తగా భూములు కొనుగోలు చేసే ముందు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. చెరువుల వద్ద షెడ్స్ కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి” అని ఆయన సూచించారు. “హైడ్రా 12 వందల చెరువులను గుర్తించింది. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ చిత్రాలు ఆధారంగా ఆక్రమణలను గుర్తించడం జరుగుతోంది” అని కమిషనర్ చెప్పారు.








