తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు (Heatwave) భగ్గుమంటున్నాయి. రోహిణీ కార్తె (Rohini Karte) ప్రారంభమైన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం (Telangana Planning Commission) విడుదల చేసిన తాజా ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్‌ను దాటాయి. ముఖ్యంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే హాట్‌స్పాట్‌గా నిలిచింది. అలాగే సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో 46.4 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 46.3 డిగ్రీల చొప్పున ఎండలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
ఇక హైదరాబాద్లో (Hyderabad) కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నగరంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఎండలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45.7 డిగ్రీల వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.








