పుష్కరాల ఏర్పాట్లపై పవన్ రివ్యూ.. అధికారుల తీరుపై అసంతృప్తి!

పుష్కరాల ఏర్పాట్లపై పవన్ రివ్యూ.. అధికారుల తీరుపై అసంతృప్తి!

గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనుల సన్నద్ధతపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోమవారం రాజమహేంద్రవరంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో ఆశించిన రీతిలో పుష్కరాల పనులు పెద్ద ఎత్తున జరగడం లేదని పవన్‌తో పాటు సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి (Buchchaiah Chowdary) కూడా ఆక్షేపించారు.

ప్రణాళిక లేదు.. ఏడాదిలో రూ.7 వేల కోట్ల పనులు ఎలా చేస్తారు అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు. పుష్కరాల నిర్వహణ కోసం 6 జిల్లాల పరిధిలో రూ. 8,600 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు వివరించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతవరకు రూ.8,600 కోట్ల పనులకు సంబంధించిన పూర్తిస్థాయి డీపీఆర్ (DPR)లు, ప్లాన్‌లు ఎందుకు సిద్ధం చేయలేదని అధికారులను నిలదీశారు.

కేవలం ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉండగా.. ఇంత భారీ మొత్తంలో పనులను నాణ్యతతో ఎలా పూర్తి చేస్తారని జిల్లా కలెక్టర్‌ను పవన్ ప్రశ్నించారు. “పాచిపోయిన (నిల్వ ఉన్న) సిమెంట్‌తో పనులు చేస్తే భవనాలు, ఘాట్లు కూలిపోతాయి. నాసిరకం పనుల వల్ల భక్తుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది” అని తీవ్రంగా హెచ్చరించారు. “ఇష్టారీతిన ఖర్చు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దగ్గరికి నిధుల కోసం వెళ్లాలంటే ముందస్తు ప్రణాళిక, స్పష్టమైన నివేదికలు సిద్ధంగా ఉండాలి.”

టీటీడీ నిధులు తేవాలన్న సోము వీర్రాజు
ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీజేపీ(BJP) సీనియర్ నేత సోము వీర్రాజు (Somuveerraju) మాట్లాడుతూ.. పుష్కరాల పనులు వేగవంతం చేసేందుకు ప్రస్తుతం నిధుల కొరత ఉందని పేర్కొన్నారు. లోటును పూడ్చేందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి పుష్కరాల కోసం నిధులు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని సోము వీర్రాజు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు వేసి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలని ఆయన సూచించారు.

274 పంచాయతీల్లో ఏర్పాట్లు
గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి నగరానికే పరిమితం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని 274 పంచాయతీల్లో పుష్కరాల పనులు చేపట్టాల్సి ఉంటుందని, అన్ని ప్రాంతాల్లోనూ భక్తులకు సమానంగా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పుష్కరాల పనుల సన్నద్ధత, నిధుల అంశాన్ని త్వరలోనే రాష్ట్ర కేబినెట్ (మంత్రివర్గ) సమావేశంలో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment