15 సంవత్సరాలు కూటమి కలిసి ఉండాలని జనసేన (Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోరుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూటమిలోని టీడీపీ-జనసేన (TDP -Jana Sena) పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. నిరసనలు, దాడుల నుంచి ఏకంగా ఎమ్మెల్యకు చెప్పులు చూపించే స్థాయికి చేరింది పరిస్థితి. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే పులివర్తి నానికి (Pulivarthi Nani) జనసేన(Jana Sena) పార్టీ నేత మురళి రెడ్డి (Murali Reddy) ఏకంగా ఎమ్మెల్యేకు చెప్పు చూపిస్తూ నిలదీయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
మా గ్రామాన్ని పాకిస్థాన్‌తో పోల్చుతారా..?
ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయ (Mukkoti Agastheeswara Swamy Temple) ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇందుమూలిరెడ్డిని (Indumooli Reddy) కలిసేందుకు చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి ఎమ్మెల్యే పులివర్తి నాని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నేత మురళి రెడ్డి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గతంలో ఎమ్మెల్యే పులివర్తి నాని తొండవాడ గ్రామాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్‌తో (Pakistan) పోల్చారని, దీనిపై ఎమ్మెల్యే ముందుగా గ్రామ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని మురళి రెడ్డి డిమాండ్ చేశారు.
“గడిచిన ఎన్నికల్లో 566 ఓట్ల మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్‌తో ఎలా పోల్చుతావు?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “చెప్పుతో కొడతా నా కొ*కా.. బయటకు రా” అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చెప్పు (Slipper) చూపించి నిలదీశారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా, అక్కడే ఉన్న స్థానికులు, అనుచరులు వెంటనే స్పందించి జనసేన నేతను అడ్డుకున్నారు.
కూటమి ఎమ్మెల్యేను జనసేన నేత ఇంత బహిరంగంగా, తీవ్ర పదజాలంతో నిలదీసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కూటమి భవిష్యత్తుపై చర్చలు
ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే దానికి ఈ ఘటనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే కూటమి నేత నుంచి ఎమ్మెల్యేకు ఈ స్థాయి వ్యతిరేకత రావడంపై టీడీపీ అధిష్టానం, జనసేన ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.








