ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులే లక్ష్యంగా ఉద్యోగాల పేరుతో సాగుతున్న మోసాలు మరోసారి కలకలం రేపాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు నిరుద్యోగ యువతకు నకిలీ ఆర్డర్లతో భారీ టోకరా వేశారు. నర్సులు, అటెండర్ పోస్టుల పేరిట నకిలీ ఇంటర్వ్యూ లెటర్లు నమ్మి మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ (APIIC) బిల్డింగ్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.
నకిలీ లెటర్లతో బురిడీ..
బాధితులు కథనం ప్రకారం.. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులను భర్తీ చేస్తున్నామంటూ నిరుద్యోగులను నమ్మించాడు. ఉద్యోగం పక్కాగా వస్తుందని నమ్మబలికి, నిజమైన నియామక పత్రాలను పోలిన నకిలీ ఇంటర్వ్యూ లెటర్లను, ఆర్డర్ కాపీలను బాధితులకు జారీ చేశాడు. ఈ ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుండి దాదాపు రూ.75,000 వరకు నగదును నిరంజన్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా వసూలు చేసినట్లు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలిసిన అసలు నిజం!
చేతికి ఇంటర్వ్యూ లెటర్లు రావడంతో ఉద్యోగాల్లో చేరేందుకు బాధితులు శుక్రవారం మంగళగిరిలోని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయానికి (APIIC భవనం) వచ్చారు. అక్కడ ఉన్న అధికారులకు తమ లేఖలను చూపించగా, వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాము ఎలాంటి నోటిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ లెటర్లు జారీ చేయలేదని, బాధితులు తెచ్చినవన్నీ నకిలీ (Fake) లెటర్లని అధికారులు స్పష్టం చేశారు.
బాధితుల బైఠాయింపు
తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యారు. అప్పులు చేసి నిరంజన్ రెడ్డికి డబ్బులు కట్టామని, తమకు న్యాయం చేయాలంటూ ఆరోగ్యశాఖ కార్యాలయం ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. నిందితుడు నిరంజన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి, తాము కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.








