ట్రంప్‌కు స్వాగతం పలకని జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ

ట్రంప్‌కు స్వాగతం పలకని జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ

Summarize with AI

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా చైనా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బీజింగ్ చేరుకున్న ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు (Chinese President) షీ జిన్‌పింగ్ (Xi Jinping) స్వయంగా స్వాగతం పలకకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అమెరికా అధ్యక్షుల పర్యటనలకు అత్యున్నత స్థాయి స్వాగతం లభిస్తుండగా.. ఈసారి షీ జిన్‌పింగ్ బదులుగా చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను (Han Zheng) పంపడం విశేషంగా మారింది. బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్‌కు చైనా అధికారులు, అమెరికా-చైనా రాయబారులు (US-China Diplomats), 300 మంది యువకులతో ప్రత్యేక స్వాగత కార్యక్రమం నిర్వహించినప్పటికీ.. జిన్‌పింగ్ (Jinping) గైర్హాజరు కావడం రాజకీయ సంకేతంగా విశ్లేషకులు చూస్తున్నారు.

ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates), సౌదీ అరేబియా(Saudi Arabia), ఖతార్(Qatar), ఇజ్రాయెల్ (Israel) పర్యటనల సమయంలో ఆయా దేశాధినేతలు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ట్రంప్‌కు స్వాగతం పలికారు. దీంతో చైనాలో మాత్రం అలాంటి గౌరవం లభించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే చైనా ప్రోటోకాల్ ప్రకారం విదేశీ నేతలకు సాధారణంగా విదేశాంగ శాఖ లేదా ఉపాధ్యక్ష స్థాయి నాయకులే స్వాగతం పలుకుతారని, షీ జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ఎవరినీ విమానాశ్రయంలో రిసీవ్ చేయరని చైనా వర్గాలు చెబుతున్నాయి. గతంలో వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ పర్యటనల సమయంలో కూడా ఇదే విధానం అమలైందని గుర్తు చేస్తున్నారు. అయితే 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) చైనా పర్యటన సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఉన్న షీ జిన్‌పింగ్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

ఈ పర్యటనలో అమెరికా-చైనా సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అరుదైన ఖనిజాల సరఫరా, వాణిజ్య సుంకాలు, తైవాన్ వివాదం, అలాగే ఇరాన్ యుద్ధ పరిస్థితులపై ట్రంప్-షీ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతం తైవాన్ అంశంపై అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ట్రంప్‌తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, పలువురు అమెరికన్ పారిశ్రామికవేత్తలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment