హైదరాబాద్ (Hyderabad) నగరంలో అర్ధరాత్రి (Midnight) వేళ మహిళలకు రక్షణ (Women Safety) ఉందా? ఒంటరిగా బయటకు వస్తే వేధింపుల నుంచి తప్పించుకోలేరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా మల్కాజ్‌గిరి (Malkajgiri) పోలీస్ కమిషనర్(Police Commissioner) బి. సుమతి (B. Sumathi, IPS) స్వయంగా రంగంలోకి దిగి నిర్వహించిన ఒక స్పెషల్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తు ఒక ఐపీఎస్ అధికారిణినే పోకిరీలు వేధించిన తీరు నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
కామన్ లేడీలా రోడ్డుపైకి..
మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు సీపీ సుమతి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక సామాన్య మహిళలా వేషధారణ మార్చుకుని దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డుపైకి (Dilsukhnagar Main Road) వచ్చారు. ఆమె ఎవరనే విషయం తెలియని ఆకతాయిలు, ఒంటరిగా ఉన్న మహిళను చూడగానే తమ వక్ర బుద్ధిని బయటపెట్టారు.
‘వస్తావా.. రేటెంత?’ అంటూ వేధింపులు
రోడ్డుపై నిల్చున్న సుమతి గారిని చుట్టుముట్టిన కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. “వస్తావా? రేటెంత?” అంటూ జుగుప్సాకరమైన ప్రశ్నలతో ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఒక ఉన్నత స్థాయి అధికారిణి అని కూడా తెలియకుండా వారు చేసిన ఈ అసభ్య చేష్టలకు ఆమె షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమైన ఆమె, తన సిబ్బందికి సంకేతాలు ఇచ్చారు.
40 మంది పోకిరీల అరెస్ట్
అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఈ స్పెషల్ ఆపరేషన్ సాగింది. సుమతి గారిని వేధించిన వారితో పాటు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువమంది ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.








