తమిళనాడు (Tamil Nadu) రాజకీయ యవనికపై ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్(Vijay). తమిళనాడు ముఖ్యమంత్రిగా(Tamil Nadu Chief Minister) బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
రేపు (గురువారం) ఉదయం చెన్నైలోని (Chennai) జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో(Jawaharlal Nehru Indoor Stadium) ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. లక్షలాదిగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తల కోసం టీవీకే(TVK) శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ (Governor of Tamil Nadu) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (R. N. Ravi) విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కు 118. కాగా, TVK బలం 108 స్థానాలు (ఒంటరిగా పోటీ చేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది). ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్ల దూరంలో ఉన్న విజయ్, నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు.
కాంగ్రెస్ సానుకూలత – నేడు కీలక భేటీ
టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పటికే విజయ్‌కు తమ మద్దతు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అత్యవసరంగా సమావేశం కానుంది. కాంగ్రెస్‌తో పాటు పీఎంకే (4), వామపక్షాలు (4) మద్దతు ఇస్తే విజయ్ బలం సులభంగా 118 దాటుతుంది.
అన్నా డీఎంకేలో ప్రకంపనలు
మరోవైపు అన్నా డీఎంకేలో(AIADMK) అంతర్గత కలకలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విజయ్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు రావడంతో అధిష్టానం అప్రమత్తమైంది. రాత్రి అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi K. Palaniswami) (EPS) నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశమయ్యారు. టీవీకేకి మద్దతు ఇచ్చే విషయంలో పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. డీఎంకేను నిలువరించేందుకు విజయ్‌కు మద్దతు ఇద్దామని కొందరు.. ప్రతిపక్షంగానే ఉందామని మరికొందరు వాదించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ సరికొత్త విప్లవం తీసుకొచ్చారు. డీఎంకే కోటను బద్దలు కొట్టి, అత్యధిక స్థానాలు గెలుచుకుని రేపు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.








