సాధారణంగా నేటి కాలంలో సిక్స్ ప్యాక్ బాడీ, స్లిమ్ ఫిగర్ ఉంటేనే హీరోలని, అందగాళ్లని అంటుంటారు. పొట్ట పెరిగితే తగ్గించుకోవడానికి జిమ్‌లు, డైటింగ్‌లు అంటూ నానా తంటాలు పడతాం. కానీ, ఈ ప్రపంచంలో ఒక చోట మాత్రం పొట్ట ఉన్నవారే అసలైన అందగాళ్లు. అసలు పొట్ట లేకపోతే అక్కడ పెళ్లి కూడా కాదట! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా అడవుల్లో నివసించే ‘బోడి’ (Bodi Tribe) తెగలో ఈ వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది.
పొట్టే పౌరుషానికి చిహ్నం..
ఇథియోపియాలోని ఓమో లోయలో నివసించే బోడి తెగ వారు.. ముందుకు పొడుచుకు వచ్చే పొట్టనే పురుషులకు నిజమైన గౌరవంగా, అందానికి కొలమానంగా భావిస్తారు. ఎవరికైతే పెద్ద పొట్ట ఉంటుందో వారినే అత్యంత శక్తిమంతుడిగా, ఆకర్షణీయమైన వ్యక్తిగా ఆ తెగ ప్రజలు గుర్తిస్తారు.

పెద్ద పొట్ట కోసం ‘కేల్’ పండుగ..
ఈ తెగలో ప్రతి సంవత్సరం ‘కేల్’ (Ka’el) అనే ఒక ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటారు. ఇది కేవలం పెద్ద పొట్ట ఉన్న వారి కోసం నిర్వహించే పోటీ. ఈ పోటీలో గెలవడానికి అక్కడి పురుషులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. పోటీకి ఆరు నెలల ముందు నుంచే ఎంపిక చేసిన పురుషులు ఒక ప్రత్యేక గుడిసెలోకి వెళ్తారు. ఆ సమయంలో వారు బయటకు రాకూడదు, ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదు. ప్రతిరోజూ పొట్ట పగిలేంత వరకు తింటూనే ఉంటారు. ముఖ్యంగా ఆవు పాలు, రక్తం కలిపిన ఒక ప్రత్యేకమైన ‘ఎనర్జీ డ్రింక్’ను గంటల వ్యవధిలో లీటర్ల కొద్దీ తాగుతారు. దీనివల్ల వారి కడుపులు బెలూన్లలా ఉబ్బుతాయి.

విజేతకు అందగత్తెలతో వివాహం!
పండుగ రోజున పురుషులంతా తమ శరీరానికి బూడిద, బురద పూసుకుని ప్రత్యేక నృత్యాలు చేస్తారు. తెగ పెద్దలు అందరి పొట్టలను కొలిచి, ఎవరి పొట్ట అతి పెద్దగా ఉంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ టైటిల్ గెలిచిన వ్యక్తికి ఆ తెగలో ఒక ‘సూపర్ స్టార్’ హోదా లభిస్తుంది. తెగలోని అత్యంత అందమైన యువతులు అతడిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆ వ్యక్తికి సమాజంలో అత్యున్నత గౌరవం దక్కుతుంది.
అందానికి ఒకే ప్రమాణం అంటూ ఏదీ లేదని, అది చూసే కళ్లను బట్టి, ఆయా ప్రాంతాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటుందని బోడి తెగ వారి ఈ ఆచారం నిరూపిస్తోంది. మన దగ్గర పొట్ట ఉంటే విమర్శిస్తారు.. కానీ అక్కడ మాత్రం అదే అందానికి అసలైన చిరునామా.







