భారత్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అరెస్ట్

భారత్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అరెస్ట్

దేశ రాజధానిలో భారీ ఉగ్రవాద (Terrorism) కుట్రను ఢిల్లీ పోలీసులు (Delhi Police) సమర్థవంతంగా భగ్నం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba (LeT)కి చెందిన కీలక ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్‌ (Shabbir Ahmad Lone)ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పునరుద్ధరించేందుకు ఇతడు వేసిన మాస్టర్ ప్లాన్‌ను భద్రతా దళాలు చిత్తు చేశాయి.

హఫీజ్ సయీద్‌తో నేరుగా సంబంధాలు
పోలీసుల విచారణలో షబ్బీర్ అహ్మద్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. లష్కరే తోయిబా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ (Hafiz Saeed), అలాగే మరో కీలక నేత జకీర్ రెహమాన్ లక్వీలతో (Zaki-ur-Rehman Lakhvi) షబ్బీర్ అహ్మద్‌కు నేరుగా సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్రవాద అగ్రనేతల కనుసన్నల్లోనే ఇతడు భారత్‌లో(India) విద్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్ కేంద్రంగా శిక్షణ శిబిరాలు
షబ్బీర్ అహ్మద్ కేవలం భారత్‌లోనే కాకుండా సరిహద్దు దేశాల్లోనూ తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. బంగ్లాదేశ్‌లోని (Bangladesh) ఢాకా (Dhaka) కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించడం, ఆయుధాల సరఫరా చేయడం వంటి పనులను ఇతడు పర్యవేక్షిస్తున్నాడు. భారతదేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని షబ్బీర్ తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, వారిని ‘స్లీపర్ సెల్స్’ (Sleeper Cells)గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఉగ్ర నెట్‌వర్క్ పునరుద్ధరణే లక్ష్యం
గత కొంతకాలంగా భారత్‌లో బలహీనపడిన లష్కరే తోయిబా నెట్‌వర్క్‌ను తిరిగి బలోపేతం చేసే బాధ్యతను షబ్బీర్ అహ్మద్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇతడి అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా జరగాల్సిన అనేక అవాంఛనీయ సంఘటనలు ఆగిపోయాయని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు, ఈ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment