లోకేష్ ఇలాకాలో టీడీపీ నేత ఆగ‌డాలు.. యువ‌తుల‌ ఫొటోలు తీసి మార్ఫింగ్

లోకేష్ ఇలాకాలో టీడీపీ నేత ఆగ‌డాలు.. యువ‌తుల‌ ఫొటోలు తీసి మార్ఫింగ్

కూట‌మి ప్ర‌భుత్వంలో(Alliance Government) ముఖ్య‌మైన మంత్రి చ‌లామ‌ణి అవుతున్న‌ నారా లోకేష్ (Nara Lokesh) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరిలో (Mangalagiri Constituency) మ‌హిళ‌లు రోడ్డెక్కారు. మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోబోన‌న్న లోకేష్ ప్ర‌సంగాల‌కు విరుద్ధంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓ టీడీపీ నేత దారుణాల‌కు పాల్ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది.

టీడీపీ నాయ‌కుడు మహిళల ఫొటోలు (Photos) తీసి మార్ఫింగ్ (Morphing) చేస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కలకలం రేపింది. దుగ్గిరాల మండ‌లం తుమ్మపూడి గ్రామానికి చెందిన టీడీపీ నేత‌ నల్లమామిడి ఆంజనేయులు (TDP Leader Nallamamidi Anjaneyulu) కళాశాల విద్యార్థినులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడన్న విషయాన్ని గుర్తించిన ఓ విద్యార్థిని శనివారం రాత్రి అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించింది.

ఈ సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ న‌ర్ర శ్రీ‌నివాస‌రావు (TDP Leader & Former Sarpanch Narra Srinivasa Rao) మహిళలతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కేసులు పెట్టినా వెంటనే బయటకు తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానంటూ బెదిరించాడని మహిళలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. తెనాలి-మంగ‌ళ‌గిరి రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు సమీపంలోని చర్చిలో ఉంచారని మహిళలు ఆరోపించారు. గతంలో కూడా అతను మహిళల ఫొటోలు తీస్తుండగా గమనించి కొందరు మహిళలు అతనికి హెచ్చరికలు ఇచ్చినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదని బాధితులు తెలిపారు. ఇక దళిత బాలికల ఫొటోలు తీసినట్లు ఆరోపణలు రావడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. విషయం తెలుసుకున్న వైసీపీకి (YSRCP)చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ(Aruna) సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళలకు మద్దతు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సుమారు నాలుగు గంటల తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment