రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో నలుగురు మృతి

రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో నలుగురు మృతి

Summarize with AI

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం (Rajamahendravaram) కల్తీ పాల ఘటనలో (Adulterated Milk Incident) మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ ఘటనలో తాజాగా దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందగా.. అంతకుముందు, చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం చనిపోయారు.

మరో నలుగురు చిన్నారులు.. రాజమండ్రి (Rajahmundry) పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరికి ఒక్కసారిగా మూత్రం బంద్‌ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్‌ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు.

పాల వ్యాపారి గణేష్‌ అరెస్ట్‌..
ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్‌(Ganesh)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్‌ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ (Health & Family Welfare Commissioner) వీరపాండియన్‌ (Veerapandian) తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉంద­ని,­అ­క్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ల్యాబ్‌కు నమూనాలు
కల్తీ పాలతో నలుగురు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్‌ (District Collector) కీర్తి చేకూరి (Keerthi Chekuri) అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్‌ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.

5 రోజుల్లో 12 మంది బాధితులు?
చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, చౌడేశ్వరి నగర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment