గంజాయి విక్రేతలు వీరంగం సృష్టించారు. ఏకంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుతో పోలీసులపై రెచ్చిపోవడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గంజాయి విక్రేతల హంగామా తీవ్ర దుమారం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో నిన్న రాత్రి గుత్తి – యాడికి మధ్య గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ కారుతో ప్రయాణిస్తూ ఏకంగా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాముడుపై దాడికి కూడా యత్నించారు. పోలీసులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీస్ వాహనమెక్కి మీసాలు తిప్పుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.
ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్గా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో గంజాయి విక్రేతలు తిరగడం, పోలీసులను బెదిరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గంజాయి విక్రేతలకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి మాఫియాపై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
100 రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని సీఎ చంద్రబాబు హామీ ఇచ్చినా, నేటికి అధికారంలోకి వచ్చి 604 రోజులు గడిచినా గంజాయి నియంత్రణలో విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్తోనే గంజాయి బ్యాచ్ పట్టుబడడం కూటమి ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బిగ్ బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) January 29, 2026
టీడీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుతో గంజాయి బ్యాచ్ వీరంగం
గుంతకల్లులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. పోలీసులపై దౌర్జన్యం
కానిస్టేబుల్ రాముడుపై దాడికి యత్నం.. దుర్భాషలు
గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ వేసుకున్న గంజాయి విక్రేతలు
వీరంగం… pic.twitter.com/lenCXZmZ8F








