ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు వరుసగా ఒక్కొక్కటి క్లోజ్ అవుతున్నాయి. చంద్రబాబుపై నమోదైన లిక్కర్, ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్ కేసులు వరుసగా కొట్టివేయబడ్డాయి. కాగా, కేసుల ఉపసంహరణ వ్యవహారంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులను ఎందుకు క్లోజ్ చేస్తున్నారన్న విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి.
చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఏపీ సీఐడీ ఏసీబీ న్యాయస్థానంలో ఫైనల్ రిపోర్టు దాఖలు చేయగా, ఆ రిపోర్టును అంగీకరిస్తూ ఏసీబీ కోర్టు కేసులను మూసివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం విజయవాడలో ఉన్నప్పటికీ, అధికార పరిధి లేని ఏసీబీ కోర్టు హడావుడిగా కేసులను మూసివేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని ఆయన వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఫైనల్ రిపోర్టు దాఖలు చేసిన వెంటనే సీఆర్పీసీ 164 కింద నమోదైన కీలక వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ న్యాయమూర్తి కేసును మూసివేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వేల కోట్ల రూపాయల దుర్వినియోగంపై ఉన్న ఆరోపణలున్న కేసులను గంటల వ్యవధిలో ముగించడం చట్టసమ్మతం కాదని జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులను ఉపసంహరించుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు.
పిటిషనర్ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, కేసులను ఎందుకు మూసివేశారో తక్షణమే వివరాలు సమర్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. అయితే పూర్తి సమాచారాన్ని సమర్పించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ప్రభుత్వం పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీయనుంది.








