అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిన తొలినాళ్లలోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెలలు గడుస్తున్నా ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని తన చేరికను వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగినా మళ్లీ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నానిని అడ్డుకునేది ఎవరు..?
ఆళ్ల నాని చేరికను ఏలూరుకు చెందిన టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (బడేటి చంటి) కూడా ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. టీడీపీ నేతల కారణంగా ఆళ్ల నాని చేరిన వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు మరిన్ని అడ్డంకులు ఎదుర్కునేలా కనిపిస్తోంది.
స్థానిక నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోకపోవడంతో ఆళ్ల నాని టీడీపీలో చేరిక మరోసారి వాయిదా పడింది. గతంలో కూడా నాలుగు సార్లు వాయిదా పడినప్పటికీ.. నాని చేరిక ఇప్పుడు టీడీపీకి మరింత అసంతృప్తిని తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు టీడీపీ క్యాడర్ కూడా ఈ చేరికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.