సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమాయక పురుషులను వలలోకి లాగి, శృంగార వీడియోలతో బెదిరిస్తూ లక్షల రూపాయలు దండుకున్న భార్యాభర్తల గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
మంచిర్యాల జిల్లా (Mancherial District) లక్షెట్టిపేట మండలం వెంకటరావుపేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేసేవాడు. ఇతనికి మంచిర్యాలకు చెందిన 29 ఏళ్ల మహిళతో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొనుగోలు చేసిన ప్లాట్‌కు సంబంధించిన ఈఎంఐలు చెల్లించడం భారంగా మారింది. ఈ క్రమంలోనే డబ్బులు సంపాదించేందుకు భార్యాభర్తలు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయ పోస్టులు పెట్టి పురుషులను వలలోకి లాగుతున్న భార్య, వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిచి సన్నిహితంగా మెలిగేది. ఈ సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. అనంతరం ఆ వీడియోలను బయటపెడతామని బెదిరిస్తూ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇలా గత మూడేళ్లలో సుమారు వంద మందికిపైగా పురుషులను బ్లాక్‌మెయిల్ (Blackmail) చేసి లక్షల రూపాయలు దండుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని (Lorry Businessman) శృంగార వీడియోలతో బెదిరించి రూ.13 లక్షలు వసూలు చేసిన దంపతులు, మరోసారి రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులైన భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని, ఇలాంటి బ్లాక్‌మెయిల్ కేసుల్లో ఎవరైనా బాధితులైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.








