గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వినియోగదారుల్లో ఆందోళన కలిగించిన ‘డేటా లీక్’ (Data Leak) వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని, వెంటనే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ మార్చుకోవాలని సూచిస్తూ వచ్చిన ఈమెయిల్స్ కారణంగా చాలామంది భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రచారంపై మెటా సంస్థ (Meta Company) స్పష్టత ఇచ్చింది.
అసలు కారణం ఇదే
చాలా మంది యూజర్లకు అకస్మాత్తుగా ‘పాస్‌వర్డ్ రీసెట్’ (Password Reset) మెయిల్స్ రావడంతో తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న అనుమానం వ్యక్తమైంది. కానీ దీనికి డేటా లీక్‌తో ఎలాంటి సంబంధం లేదని మెటా తేల్చి చెప్పింది. తమ సిస్టమ్స్‌లో ఎలాంటి భద్రతా లోపం లేదని, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది.
సాంకేతిక లోపం వల్లే ఈ గందరగోళం
ఈ మెయిల్స్ రావడానికి కారణమైనది కేవలం ఒక సాంకేతిక లోపం (బగ్) మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ఆ సమస్యను ఇప్పటికే గుర్తించి పరిష్కరించినట్లు మెటా తెలిపింది. వినియోగదారులు ఆ మెయిల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పాస్‌వర్డ్ మార్చాల్సిన అవసరం కూడా లేదని సూచించింది.
యూజర్లకు మెటా భరోసా
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మెటా భరోసా ఇచ్చింది. ప్రతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సురక్షితంగానే ఉందని స్పష్టం చేస్తూ, ఈ ఘటన వల్ల యూజర్లలో ఏర్పడిన గందరగోళానికి క్షమాపణలు కూడా కోరింది.








