తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో తెలుగు రాష్ట్రాల భక్తుల మధ్య వివక్ష చోటు చేసుకుంటోందని ఆరోపించారు.
దర్శనం విషయంలోనూ, వసతి గృహాల కేటాయింపులో వివక్ష జరుగుతుందని ఆరోపించారు. భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకోవడం ఎంతో విశిష్టమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, తిరుమల శ్రీవారు అందరి దేవుడని, తెలంగాణలో పుట్టిన ప్రతి భక్తుడి మనసులో శ్రీవారి స్థానం ప్రత్యేకమని గుర్తు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి
తిరుమలలో కొనసాగుతున్న ఈ వివక్షతను పరిష్కరించడానికి టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తిరుమలలో భక్తుల విషయంలో సమానత్వం పాటించాలని ఆయన కోరారు.