ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై తనకున్న భక్తిని చాటుకుంటానంటూ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19న షాద్‌నగర్ (Shadnagar) నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (Tirumala Sri Venkateswara Swamy Temple) వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో మాత్రం వింత చర్చ మొదలైంది.
మొక్కు వెనుక ఉన్న కథ
గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జైలుకు వెళ్లిన సందర్భంలో, ఆయన నిర్దోషిగా విడుదలై మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తిరుమల శ్రీవారిని ప్రత్యేకంగా మొక్కుకున్నట్లుగా బండ్ల గణేష్ చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, అప్పట్లో చేసిన మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు.
జంగా స్థానానికి ఖర్చీఫ్ వేస్తున్నారా..?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డ్ సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపించారు. తనపై ఆంధ్రజ్యోతి పత్రిక చేసిన తప్పుడు ప్రచారాలు, వార్తల వల్లే తాను తీవ్ర మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లుగా మీడియా ముందు జంగాకృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగూ ఆ సీటు ఖాళీ కానుంది. దీంతో టీటీడీ(TTD)లో తనకు బెర్త్ సంపాదించుకునేందుకు బండ్ల గణేష్ చంద్రబాబుకు భజన చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా వేదికలపై పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా సంబోధించే బండ్ల గణేష్.. పవన్‌ను వదిలేసి, చంద్రబాబు గెలవాలని, ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారా..? అన్నది ఆలోచించాల్సిన విషయమంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి దీనిపై బండ్లన్న ఎలా స్పందిస్తారో చూడాలి.








