‘దండోరా’ ఈవెంట్ (Dandora Event)లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ (Shivaji) చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌కు అనసూయ (Anasuya Bharadwaj), చిన్మయి (Chinmayi Sripada) లాంటి ప్రముఖులు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు సంబంధించిన ఘటనను ఉదాహరణగా చూపిస్తూ శివాజీ మాట్లాడటంపై అనసూయ తీవ్రంగా ఫైర్ అవుతూ, “తప్పు చేసే వాళ్లను వదిలేసి మాకు నీతులు చెబుతారా?” అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారగా, నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు అనసూయకు మద్దతు తెలపడంతో సోషల్ మీడియా మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది.
అయితే సడెన్ ట్విస్ట్ ఇస్తూ తాజాగా అనసూయ తన స్టాండ్‌ను కొంత మార్చినట్లు కనిపిస్తోంది. శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శివాజీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారని, ప్రజలు ఆయన మాట వినే స్థాయికి ఎదిగారని ఆమె పేర్కొన్నారు.
ఆడపిల్లల భద్రతపై ఆయన చూపిన ఆరాటం వెనుక మంచి ఉద్దేశమే ఉందని చెప్పిన అనసూయ, అయితే బాధ్యత కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ ఉంటుందని కూడా గుర్తు చేసి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వెళ్లేది కాదని సున్నితంగా అభిప్రాయపడ్డారు. దీంతో కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని టాలీవుడ్ వర్గాలు అంటుండగా, అనసూయ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.








