అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉందా..? – మంత్రిని నిల‌దీసిన రైతులు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉందా..? - మంత్రిని నిల‌దీసిన రైతులు

అమరావతి (Amaravati) పరిధిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ (Land Pooling Process) అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వడ్డమాను గ్రామంలో తొలిరోజు గ్రామసభ నిర్వహించారు. మంత్రి నారాయ‌ణ, టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వడ్డమాను గ్రామసభ గందరగోళంగా మారింది. గ్రామస్తులు, రైతులతో కలిసి భూ సమీకరణ అంశాలపై చర్చించిన సంద‌ర్భంలో రైతులు (Farmers) మంత్రి, ఎమ్మెల్యేపై తిర‌గ‌బ‌డ్డారు.

గ్రామసభలో పాల్గొన్న రైతులు అమరావతి రాజధాని చట్టబద్ధత (Legal Validity of Amaravati Capital), గతంలో జరిగిన అభివృద్ధి, భూములు ఇచ్చే రైతులకు లభించే ప్రయోజనాలపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

రైతులు మంత్రిని నేరుగా ప్రశ్నిస్తూ.. అమరావతికి చట్టబద్ధత ఎక్కడ ఉంది?, మొదటి విడత ల్యాండ్ పూలింగ్‌లో ఎంత వరకు అభివృద్ధి జరిగింది?, మూడేళ్లలో అభివృద్ధి పూర్తవుతుందన్న హామీని రాసిచ్చగలరా?, మూడేళ్లలో రాజధాని అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా?, ఇవి గ్యారంటీలా? లేక రాజకీయ హామీలేనా? అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు.

ఈ ప్రశ్నలకు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ (MLA Shravan Kumar) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టం ఇప్పటికీ అమల్లోనే ఉందని, అది చట్టబద్ధమైన రాజధానిగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. మూడేళ్లలో రాజధాని అభివృద్ధి జరగకపోతే రైతులకు కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుందని చెప్పారు. తొలి దశలో అభివృద్ధి నెమ్మదిగా సాగిన మాట వాస్తవమేనని, అయితే రెండో దశతో అభివృద్ధి వేగం పెరుగుతుందని ఆగ్ర‌హంతో ఉన్న రైతుల‌కు భరోసా ఇచ్చారు.

ఇదిలా ఉండగా, రైతులు మాట్లాడుతూ 2019–24 మధ్య కాలంలో అమరావతిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల ద్వారా ఏమి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఎంత వరకు లాభం చేకూరిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

కాగా, అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 7 రెవెన్యూ గ్రామాల్లో 16,666.57 ఎకరాల భూ సమీకరణ చేపట్టనున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణాల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ జరుగనుంది. ఇప్పటికే వడ్డమానులో 1,937 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment