స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ ఈవ్ వేడుకలు విషాదంగా మారాయి. నూతన సంవత్సర స్వాగత వేడుకల సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్–మొంటానాలో ఉన్న లగ్జరీ బార్‌లో జరిగిన భారీ పేలుడులో పలువురు మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పేలుడు ‘లే కాన్స్టెలేషన్ బార్ అండ్ లౌంజ్’ (Le Constellation Bar and Lounge)లో చోటుచేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం వందలాది మంది అక్కడ చేరుకున్న సమయంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. పేలుడుతో పాటు భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, పేలుడు జరిగిన వెంటనే బార్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో బార్ నుంచి భారీగా పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్విట్జర్లాండ్ పోలీసులు స్పందించారు. “అకస్మాత్తుగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు, మరికొందరు మృతి చెందారు” అని పోలీసు ప్రతినిధి గేటన్ లాథియన్ తెలిపారు. అయితే ఇప్పటివరకు మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు.
పేలుడుకు గల కారణాలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల స్విట్జర్లాండ్‌లో అసాధారణ కరువు పరిస్థితులు చోటుచేసుకోవడం వల్ల భద్రతాపరమైన అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఈ పేలుడు ఘటన జరగడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.
స్విస్ ఆల్ప్స్ మధ్యలో ఉన్న క్రాన్స్–మొంటానా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. స్కీయింగ్, స్నోబోర్డింగ్, గోల్ఫ్ వంటి క్రీడలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో జరిగిన ఈ దుర్ఘటన పర్యాటక రంగంలో కూడా కలకలం సృష్టిస్తోంది. ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
— Telugu Feed (@Telugufeedsite) January 1, 2026
స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్-మోంటానాలో స్కీ బార్‌లో పేలుడు
అంటుకున్న మంటలు, పలువురు మృతి
అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపిన స్విస్ పోలీసులు pic.twitter.com/iOBzCBVdlZ








