పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన జల్సా సినిమా (Jalsa Movie) రీ–రిలీజ్(Re-release) సందర్భంగా థియేటర్ల వద్ద చోటుచేసుకున్న ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జనసేన పార్టీ (Jana Sena Party)కి చెందిన కొందరు కార్యకర్తలు హద్దులు దాటి వ్యవహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మాస్క్‌లు (Masks) ధరించి థియేటర్‌లో వెకిలి చేష్టలకు పాల్పడటం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఘటనలు ఒక కొత్త వికృత సంప్రదాయానికి నాంది పలికినట్లుగా సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక జల్సా సినిమా చూడటానికి వచ్చిన మహేష్‌బాబు అభిమాని (Mahesh Babu Fan)పై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన ఘటన మరింత సంచలనం సృష్టించింది. థియేటర్‌లో బూతులతో రెచ్చిపోయిన కార్యకర్తలు అభిమానిని వేధించడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. సినిమా చూడటానికి వచ్చిన సామాన్య ప్రేక్షకులపై ఈ రకమైన దాడులు జరగడం థియేటర్ వాతావరణాన్ని భయానకంగా మార్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జనసేన కార్యకర్తల ఈ రెచ్చగొట్టే చర్యలు సమాజంలో అశాంతిని సృష్టించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా వేడుకల పేరుతో రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, ఇతర హీరోల అభిమానులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని సినీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇకపై ప్రతి సినిమా రిలీజ్ రోజున ఇలాంటి ఘటనలు జరుగుతాయేమోనన్న భయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గతంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగేవాళ్లను వదిలిపెట్టబోమని, తాటతీస్తానని వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. అదే విధంగా ఇప్పుడు తన సినిమా రీ రిలీజ్ సందర్భంగా తన పేరుతో జనసేన కార్యకర్తలు చేసిన అరాచకంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? తమ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వికృత చర్యలకు అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.







