విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant)పై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) కన్నుపడిందని, ఆంధ్రుల ఆస్తిని ప్రైవేట్‌కు కట్టబెట్టాలనే కుట్ర మొదలైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు పెద్ద నాయకులు లేకపోయినా, కార్యకర్తలు మాత్రం మిగిలారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో పర్యటించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కులపిచ్చిలో (Caste Politics) పడి ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారని, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే ఇంగితజ్ఞానం కూడా బీజేపీ(BJP) ప్రభుత్వానికి లేదని తీవ్ర విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో భావోద్వేగంగా మాట్లాడారని, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా మౌనంగా కూర్చున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయ్యారని, అయినా స్టీల్ ప్లాంట్ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రభుత్వం, పోలీసుల వేధింపులు భరించలేక స్టీల్ ప్లాంట్ కార్మికులు వీఆర్ఎస్ తీసుకుంటున్న పరిస్థితి దయనీయమని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, అప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా దక్కుతుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పార్లమెంటులో ప్రకటించినది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనేనని జగ్గారెడ్డి గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో రూ.14 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన చేయొద్దని కోరిన ఏకైక వ్యక్తి తానేనని చెప్పిన జగ్గారెడ్డి, తెలంగాణ గడ్డపై ఉన్న తనకు ఉన్న క్లారిటీ ఏపీ నాయకులకు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకైనా, ఏపీకైనా వాస్తవాలు మాట్లాడే ధైర్యం తనకే ఉందన్నారు. ఏపీలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కమిట్మెంట్ అదేనని అన్నారు.
స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయిన రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దక్కుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 20 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’