మద్యం (Alcohol), గంజాయి (Ganja) మత్తు (Intoxication) ఏపీ (Andhra Pradesh) యువత భవిష్యత్తును నాశనం చేస్తోందనే మాటకు మరో దారుణ ఘటన సాక్ష్యంగా నిలిచింది. మేజర్–మైనర్ తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడంతో బాల్యంలోనే మత్తుకు అలవాటు పడుతున్న యువత హింసాత్మక మార్గాలు ఎంచుకుంటోంది. తాజాగా విజయవాడలో (Vijayawada) చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మానవ సంబంధాలనే మంటగలిపే సంఘటన జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదన్న కోపంతో మైనర్ బాలుడు (Minor Boy) తన సొంత తాతను (Grandfather) హత్య (Murder) చేశాడు. వృద్ధుడు బుల్‌రాజు (Bulliraju) తన మవనడితో కలిసి తాపి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మైనర్ బాలుడు మద్యానికి అలవాటు పడడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి మద్యం కోసం రూ.10 ఇవ్వాలని అడగగా తాత నిరాకరించడంతో కోపం పెంచుకున్న మనవడు అతనిపై దాడికి పాల్పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన వృద్ధుడు రక్తపు మడుగులో పడివుండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వృద్ధుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం, ఆందోళనకు దారి తీసింది.
హత్య అనంతరం మైనర్ బాలుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాల్యంలోనే మత్తుకు బానిసై కుటుంబ సభ్యులనే హత్య చేసే స్థాయికి యువత దిగజారుతుండటంపై సామాజికవర్గాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.








