న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశం ఉన్నా.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం (Alliance Government) 42 కుటుంబాలను (42 Families) అన్యాయంగా రోడ్డున పడేసిందని వైసీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ (Vijayawada) భవానీపురం జోజి నగర్ (Bhavanipuram Joji Nagar)లో బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు జరిగిన కుట్రపూరిత కూల్చివేతలని ఆరోపించారు.
‘‘గత 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఈ నెల 31 వరకు స్టే ఉన్నా, ప్రైవేట్ పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు. ఏకంగా 200 మంది పోలీసులతో ఇళ్లను కూల్చివేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం’’ అని జగన్ మండిపడ్డారు.
ఈ భూమి విలువ దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని, 2016లోనే ఫేక్ సొసైటీని సృష్టించి భూమిని కాజేయడానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. కూల్చివేతల్లో (Demolitions) విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni), జనసేన కార్పొరేటర్ సోదరుడి (Jana Sena Party Corporator Brother) ప్రమేయం కూడా ఉందని తెలిపారు. బాధితులు చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), లోకేశ్ (Nara Lokesh)లను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని, చివరకు మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధితులకు ప్రభుత్వం తరపున ఇళ్ల స్థలాలు కేటాయించి బ్యాంకు లోన్లను కూడా ప్రభుత్వమే చెల్లించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధితులకు వైసీపీ పూర్తి అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విచారణకు ముందుకు రాకపోతే, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులను కోర్టు ముందు నిలబెడతామని హెచ్చరించారు.








