హీరో రామ్ (Ram Pothineni) సినిమాల ఫలితాలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జానర్ (Genre) ఏదైనా సరే, థియేటర్ల వద్ద మాత్రం ఫలితం ఒక్కటే కనిపిస్తోంది. డిజాస్టర్. మాస్ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని చేసిన స్కంద సినిమాకు ఊహించిన స్పందన రాకపోవడంతో ప్రేక్షకులు దూరమయ్యారు. ఇక ఇమేజ్ మార్చి ఫీల్‌గుడ్ సినిమా చేస్తే పరిస్థితి మారుతుందని భావించిన ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka) ప్రయత్నం కూడా బయ్యర్లను కుదేలుచేసింది. నిర్మాతకు మిగిలింది నష్టాలే.
ఇవే కాదు.. ఈ రెండు సినిమాల ముందు రామ్ చేసిన థ్రిల్లర్ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఆసక్తికరంగా ఏమిటంటే.. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం రామ్ కెరీర్‌పై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. జానర్ మార్చినా, కథల ఎంపికలో వైవిధ్యం చూపించినా ఫలితం మాత్రం మారకపోవడంతో కింకర్తవ్యం ఎదురైంది.
ప్రస్తుతం రామ్ కెరీర్ (Career) కీలక మలుపు వద్ద నిలిచింది. ఆర్కే మీడియాతో (RK Media) ఓ సినిమా చర్చల దశలో ఉన్నప్పటికీ, వరుస పరాజయాల కారణంగా ఆయన థియేటర్ మార్కెట్ గణనీయంగా పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో రామ్ సినిమాకు థియేట్రికల్ మార్కెట్ ఇరవై కోట్లను కూడా దాటడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటీటీ మార్కెట్ కూడా ఆశాజనకంగా లేదన్నది వాస్తవం.
ఇలాంటి నేపథ్యంలో రామ్‌తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్ల బడ్జెట్ అవసరమని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకే దాదాపు 65 కోట్లు ఖర్చయిన నేపథ్యంలో, యాభై కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసినా ఇప్పటి మార్కెట్ పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు రామ్ ఏ తరహా సినిమా చేస్తే ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వస్తారు అన్నదే ఒక పెద్ద ప్రశ్నగా మారగా, ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసేందుకు నిర్మాతలు ముందుకు వస్తారా అన్నది మరో కీలక సందేహంగా నిలిచింది.








