రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ పార్టీ (Congress Party) హవా స్పష్టంగా కొనసాగింది. ఆదివారం జరిగిన మలి విడత ఎన్నికల్లో 192 మండలాల పరిధిలోని 3,911 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగగా, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2,112కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ స్వల్ప మెజార్టీలతో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) కూడా ఈ ఫలితాలతో కొంత ఊరట పొందింది. బీఆర్‌ఎస్ మద్దతుతో 1,025కు పైగా అభ్యర్థులు గెలిచి సుమారు 25 శాతం సీట్లను దక్కించుకున్నారు. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలకు కలిపి 10 శాతానికి పైగా సీట్లు లభించగా, బీజేపీ మద్దతు ఉన్న 225 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు.
మలి విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా, 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీకి విస్తృత మద్దతు లభించింది. సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ మినహా ఎక్కువ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం నమోదు కాగా, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్ సహా 20 జిల్లాల్లో సగానికి పైగా సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. బీఆర్‌ఎస్ సిద్దిపేట, ఆసిఫాబాద్ జిల్లాల్లో బలం చూపగా, బీజేపీ(BJP) ప్రభావం నిర్మల్‌కే పరిమితమైంది. మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని మరింత బలపరిచినట్లుగా ఫలితాలు వెల్లడించాయి.








