అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ దిగ్గజం (Football Legend) లియోనెల్ మెస్సీని (Lionel Messi) సత్కరించేందుకు కోల్‌కతాలోని (Kolkata) సాల్ట్ లేక్ స్టేడియంలో (Salt Lake Stadium) నిర్వహించిన కార్యక్రమం తీవ్ర వివాదానికి దారి తీసింది. మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో వేలాది మంది అభిమానులు (Fans) స్టేడియానికి చేరుకున్నప్పటికీ, చివరకు ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
కార్యక్రమం ముగిసినా మెస్సీ కనిపించకపోవడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేస్తూ గందరగోళం సృష్టించారు. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఈ ఈవెంట్ నిర్వాహకుడు (Event Organizer) శతద్రు దత్తాను (Satudru Datta) అరెస్ట్(Arrest) చేశారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ(DGP) జావేద్ షమీమ్ (Javed Shamim) వెల్లడించిన వివరాల ప్రకారం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అంశాలపై శతద్రు దత్తాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురు అభిమానులు రూ.5,000 నుంచి రూ.25,000 వరకు టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంత మొత్తం ఖర్చు చేసినా మెస్సీని ఒక్క చూపు కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది.
శతద్రు దత్తా ‘A Satudru Datta Initiative’ పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తుంటారు. గతంలో పీలే, డియెగో మారడోనా, కాఫు వంటి ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజాలతో భారత్‌లో కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం “GOAT India Tour 2025”లో భాగంగా మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన ఈవెంట్లను ఆయనే నిర్వహిస్తున్నారు.








