అల్లూరి సీతారామ రాజు జిల్లా (Alluri Sitarama Raju District)లోని చింతూరు (Chinturu) ఘాట్ రోడ్ (Ghat Road)లో శుక్రవారం ఉదయం భారీ విషాదం చోటుచేసుకుంది. చింతూరు నుంచి మారేడుమిల్లి (Maredumilli) వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ భయంకర ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతిచెందగా (Died), మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి (Bhadrachalam Area Hospital) తరలించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మారేడుమిల్లి తులసి పాకల ప్రాంతం దగ్గర బస్సు లోయలో పడిపోయినట్లు తెలిసింది. ఘాట్ రోడ్ కావడంతో వాహనం అదుపు తప్పడానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అయ్యిందా? డ్రైవర్ అజాగ్రత్తా? లేక వాహనం సాంకేతిక లోపమా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు చిత్తూరు నగరం మిట్టూరు శ్రీవిఘ్నేశ్వర ట్రావెల్స్‌కు (Sri Vighneshwara Travels) చెందినదిగా గుర్తించారు. ఈనెల 6 తేదీన రాత్రి 9 గంటలు సమయంలో 39 మంది యాత్రికులతో బస్సు బయల్దేరినట్లుగా తెలుస్తోంది. 7 రోజులపాటు పుణ్యక్షేత్రాలు సందర్శనకు ప్రైవేట్ ఏజెంట్ ద్వారా ట్రావెల్స్ బస్సు వెళ్లిన బస్సు అల్లూరి జిల్లాలో ప్రమాదానికి గురవ్వడంతో ప్రయాణికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇటీవలే కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మరువకముందే వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతుండటం ప్రయాణికుల్లో భయం, ఆందోళన కలిగిస్తోంది. తరచూ ప్రైవేట్ బస్సులే ప్రమాదాలకు గురవుతుండటం, వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








