RSS ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని గౌరవించిందా..? మోడీ వ్యాఖ్యలపై షర్మిలా రియాక్ష‌న్‌

RSS ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని గౌరవించిందా..? మోడీ వ్యాఖ్యలపై షర్మిలా రియాక్ష‌న్‌

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల (AP Congress Chief Sharmila) తీవ్రంగా ఖండించారు. నెహ్రూ సమరయోధుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు కాగా, ఆయనపై అవహేళన చేయడం దేశ చరిత్రను అవమానించడం వంటిదని ఆమె అన్నారు. విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల‌.. బీజేపీ తీరును త‌ప్పుబ‌ట్టారు. పార్లమెంట్ (Parliament) సాక్షిగా మత విద్వేషాలను (Religious Hatred) రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు పెద్ద ముప్పని అభిప్రాయపడ్డారు.

నెహ్రూ స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన మహానుభావుడు కాగా, స్వతంత్ర భారతదేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ఆయనపై విమర్శలు చేయడం “దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే” అని షర్మిలా విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పూర్వీకుల పాత్ర ఎక్కడుందో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు. RSS ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని(Tricolour Flag) గౌరవించిందా, వందేమాతరం (Vande Mataram) పాడిందా అనేది కూడా ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు.

బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రజల మధ్య మరోసారి విభజన సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని షర్మిలా ఆరోపించారు. జాతీయ గీతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టడం భయంకరమైన ధోరణి అని ఆమె అన్నారు. నిజమైన చరిత్రను దాచిపెట్టి నెహ్రూజీని తప్పుపట్టే కుట్ర బీజేపీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై పెరుగుతున్న విమర్శలను మళ్లించేందుకు నెహ్రూ పేరు ఉపయోగిస్తున్నారని ఆమె విమర్శించారు.

దేశంలో జాతీయ గీతం, వందేమాతరం స్ఫూర్తిని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిలా స్పష్టం చేశారు. స్వాతంత్ర్యోద్యమంలోని అసలైన విలువలను వక్రీకరించే ప్రయత్నాలు దేశానికి ముప్పని, ప్రజలు నిజాన్ని గుర్తించి స్పందించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment