ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) మళ్లీ విజృంభిస్తోంది. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో గత రెండు రోజుల్లో ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య మూడుకు చేరింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆదివారం పల్నాడు జిల్లాకు చెందిన లూర్ధమ్మ (59), బాపట్ల జిల్లా నివాసి నాగేంద్రమ్మ (73) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం, అంతకుముందు శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన ధనమ్మ (64) మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 14 మంది రోగులు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ వార్డులో వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇప్పటి వరకు జిల్లాలో 300కి పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. స్క్రబ్ టైఫస్ వ్యాప్తి ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పొదల్లో, పంట పొలాల్లో ఉండే చిన్న పురుగుల ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరంతో పాటు శరీరంపై నల్లటి మరక, తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అప్రమత్తం అయ్యి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించడం, పొలాల్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, లక్షణాలు కనిపించగానే సమీప ఆసుపత్రిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. వ్యాధి మరింత వ్యాపించకుండా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.








