జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ (Telangana)లో తీవ్ర వివాదానికి దారితీశాయి. “కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది” అని చేసిన వ్యాఖ్యపై తెలంగాణ వాదులంతా పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలను అవమానించే విధంగా మాట్లాడిన పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే తెలంగాణ నుంచి తరిమికొడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ సినిమాలు ఆడనివ్వం – ఎమ్మెల్సీ వెంకట్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పవన్ కళ్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేయాలి. క్షమాపణలు (Apologise) చెప్పకపోతే తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. పవన్ సినిమాలు ఒక్కటీ ఇక్కడ ఆడనివ్వం. అవసరం అయితే పరిగెత్తించి తరిమికొడతాం” అని మండిపడ్డారు. గతంలో పవన్ తెలంగాణలో సినిమాలు ఆడటానికి ప్రత్యేక ప్రేమ చూపించేవారని, ఇప్పుడు పదవి వచ్చింది కాబట్టి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
క్షమాపణ చెప్పాలి – మంత్రి కోమటిరెడ్డి
తెలంగాన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. “పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతోనే మా ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీరు తాగారు” అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు. వెంటనే క్షమాపణ చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి.. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం అని హెచ్చరించారు. చిరంజీవిపై గౌరవం ఉందని, కానీ రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే పవన్ ఇలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
విద్వేషపూరిత వ్యాఖ్యలు సరికాదు – మంత్రి వాకిటి
మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) కూడా పవన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. “పవన్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు తప్పవు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషానికి కారణమయ్యే మాటలు అసలు సరికాదు” అన్నారు. తెలంగాణ వనరులను వాడుకుని ఎదిగిన పవన్ ఇప్పుడు రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడటం తగదు అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.








