బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన దిత్వా తుఫాన్ (Ditva Cyclone) దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతోంది. దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండం (Severe Cyclonic Storm) (దిత్వా) మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు (North Tamil Nadu)–పుదుచ్చేరి (Puducherry), దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాలకు సమాంతరంగా కదులుతూ బలహీనమవుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఇది వాయుగుండం స్థాయికి తగ్గే అవకాశం ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తీవ్ర వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 50 కి.మీ., పుదుచ్చేరికి 130 కి.మీ., నెల్లూరుకు 200 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలిందని సంస్థ వివరించింది.
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ముందుకు సాగుతున్న ఈ వాయుగుండం మధ్యాహ్నానికల్లా మరింత బలహీనపడుతుందని అంచనా. అయితే దాని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రేపటి వరకు సముద్ర వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, గాలుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్లడాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించింది.








