తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో గ్రామ పంచాయతీ (Village Panchayat) ఎన్నికలకు (Elections) ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలు మొత్తం మూడు విడతలుగా (Three Phases) జరగనున్నాయి. నవంబర్ 27వ తేదీన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుండి పోలింగ్ వరకు దాదాపు పదిహేను రోజుల సమయం ఉంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తొలి విడత అనంతరం నాలుగు రోజుల వ్యవధిలో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కసరత్తులు పూర్తి చేసింది.
డిసెంబర్ 15, డిసెంబర్ 19 తేదీలలో రెండు, మూడు దశల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వగా, పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశంలో పంచాయతీ ఎన్నికల పూర్తి తేదీలు, షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








