ప్ర‌భుత్వ స్కూల్‌లో దారుణం.. క్రేన్ కూలి టీచ‌ర్‌ మృతి

ప్ర‌భుత్వ స్కూల్‌లో దారుణం.. క్రేన్ కూలి టీచ‌ర్‌ మృతి

ప్ర‌భుత్వ పాఠశాల‌లో (Government School) నిర్మాణ పనుల్లోని నిర్ల‌క్ష్యం ఓ ఉపాధ్యాయురాలి (Teacher’s) ప్రాణం తీసింది. అన‌కాప‌ల్లి (Anakapalli) జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. స్కూల్‌ ఆవరణలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కాంక్రిట్ లిఫ్టింగ్‌కు ఉప‌యోగించే క్రేన్ కూలి ఉపాధ్యాయురాలిపై పడడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

మృతురాలు ఆ స్కూల్‌లో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు జోస్నా భాయ్‌ (Josna Bhai)గా గుర్తించారు. తునిలో నివాసముంటున్న ఆమె రాజానగరం హైస్కూల్‌కు బదిలీ అయ్యి మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో స్టేజ్‌పై స్లాబ్ వేయడానికి డెక్కన్ రసాయన పరిశ్రమ అందించిన సి.ఎస్.ఆర్. నిధులతో నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వెంటనే తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణంలో నిర్లక్ష్యం కారణమా? భద్రతా చర్యలు పాటించలేకపోయారా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ఉపాధ్యాయురాలి మృతితో పాఠశాల వర్గాలు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment