ఏపీకి మ‌రో తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ఏపీకి మ‌రో తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

మొంథా తుఫాన్ బీభత్సంతో కోలుకోని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మ‌రో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. మొంథా మిగిల్చిన పంటనష్ట అంచనా, పరిహారం అంశాలు ఇంకా పూర్తికాక ముందే మరో తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ నష్టం చవిచూసిన రైతులు, తీర ప్రాంత ప్ర‌జ‌లు ఈ తాజా హెచ్చరికతో భయాందోళనకు గురవుతున్నారు.

వాతావరణ శాఖ ప్రకారం.. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 24వ తేదీన వాయుగుండంగా, 26వ తేదీ నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఈ తుఫాన్‌ తీరం వైపున‌కు కదిలే అవకాశాలను పరిశీలిస్తుండగా, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మొదలవుతాయ‌ని, నేటి నుంచి వచ్చే వారం రోజుల పాటు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది.

తుఫాన్ ప్రభావం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వేగం పెరగవచ్చని, మత్స్యకారులు సముద్ర యాత్రకు వెళ్లవద్దని సూచించింది. 26వ తేదీ నుంచి తుఫాన్ ప్రభావం ఏపీలో మరింతగా ఉండవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

తాజా ప్రకృతి హెచ్చరిక నేపథ్యంలో పంటలను రక్షించుకోవడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఇప్పటికే భారీ నష్టాల నుంచి కోలుకోని రైతాంగంపై మరో విపత్తు ముంచుకొస్తుండడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment