టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంట్రీ ఏదైనా ఉంది అంటే అది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ అనే చెప్పాలి. కొన్నేళ్లుగా పలువురు దర్శకుల పేర్లు వినిపించినా, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం మాత్రం ఇంకా జరగలేదు. గతంలో ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను బాలయ్య అప్పగించారు.
అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే, షూటింగ్ ప్రారంభమవుతుందనగా ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టడంతో, మోక్షజ్ఞ ఎంట్రీపై ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకపోయేసరికి ఈ ఏడాది కూడా అతని ఎంట్రీ లేనట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో నారా రోహిత్, మోక్షజ్ఞకు లవ్ స్టోరీతో టాలీవుడ్‌లోకి రావాలని ఉందని చెప్పగా, మరోవైపు బాలయ్య తానే డైరెక్ట్ చేయబోయే ‘ఆదిత్య మాక్స్’ ద్వారా పరిచయం చేస్తానని ప్రకటించారు.
కానీ ఫ్యాన్స్ మాత్రం మాస్ కమర్షియల్ సినిమాతోనే మోక్షజ్ఞ రావాలని ఆశిస్తున్నారు. గత నెలలో మోక్షజ్ఞ 31వ పడిలోకి అడుగుపెట్టినప్పటికీ, ఎంట్రీ మాత్రం ఆలస్యమవుతుండడం ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది. కాస్త ఆలస్యం అయినా సరే, మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే సినిమా మాత్రం ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తుంది అని అతడిని దగ్గరగా చూసిన సినీ ప్రముఖులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.







