తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో పరకామణి అక్రమాల కేసు (Parakamani Illegalities Case)లో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ ఏవీఎస్‌ఓ, ప్రస్తుత రైల్వే రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ (Satish Kumar) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జూటూరు–కోమలి రైల్వే ట్రాక్ సమీపంలో ఆయన మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. తిరుమల పరకామణి విభాగంలో ఏవీఎస్‌ఓగా పనిచేసిన సతీష్ కుమార్, ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్‌ఐగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
సతీష్ కుమార్ మృతి ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ, జిల్లా ఎస్పీ జగదీష్, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పరిశీలించారు. సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ మృతిని ఆత్మహత్యగా అంగీకరించడం లేదు. ‘‘ఇది ఆత్మహత్య కాదు… హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనతో తిరుమల పరకామణి కేసు మరోమారు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన పరకామణి అక్రమాల కేసు నేపథ్యంలో సతీష్ కుమార్ మృతి అనేక అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి – వైసీపీ
కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతిని రాజకీయాలకు కేంద్రంగా మార్చారని, పరకామణి కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఇలా అనుమానాస్పదంగా మరణించడం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని వైసీపీ నేత సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఈ పరకామణి కేసులోకి లాగాలని సతీష్ కుమార్ పై ఒత్తిళ్లు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.








