కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి

కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలని సూచన.

నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి, తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో 52 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించి, దేశవ్యాప్తంగా సంబరాలను నింపారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆటగాళ్లను అభినందించారు. అయితే, ఈ చారిత్రక విజయం తర్వాతే మాజీ భారత కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె తాజాగా మాట్లాడుతూ, హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని, తన బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. జట్టు భవిష్యత్తు కోసం మార్పులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

రంగస్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై మరో మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ప్రపంచ కప్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు రావడం సహజమేనని, భారత్ గెలిచినా, ఓడినా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయాలని కొందరు మాట్లాడతారని ఆమె అన్నారు.

ప్రస్తుతం విజయాన్ని సంబరాలు చేసుకునే సమయంలో ఇలాంటి అంశాలు మాట్లాడటం సరికాదని, ఇది జట్టు సంబరాలను చెడగొడుతుందని అభిప్రాయపడ్డారు. హర్మన్‌ప్రీత్ మొదటి రోజు నుంచే మ్యాచ్ విన్నర్ అని, బలమైన షాట్లు ఆడటంలో ఆమె ప్రత్యేకమని 2007-08 నాటి ఛాలెంజర్ ట్రోఫీని గుర్తుచేసుకున్నారు. వరల్డ్ కప్ విజయంతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, హర్మన్ కెప్టెన్‌గా కొనసాగాలని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని అంజుమ్ చోప్రా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment