హరియాణా (Haryana) అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ, నకిలీ ఓటర్ల జాబితా (Fake Voters List), ఎన్నికల వ్యవస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. హరియాణాలో సుమారు 25 లక్షల ఓట్లు నకిలీగా చేర్చబడ్డాయని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను ఉపయోగించి ఎన్నికల్లో అక్రమాలు జరిగేలా చేశారని రాహుల్ విమర్శించారు.
మీడియా ప్రజెంటేషన్‌లో ఎన్నికల కమిషన్, బీజేపీ(BJP)పై రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. “ఒక యువతికి ఒక్క ఫొటోతో పది వేర్వేరు పేర్లతో, వయసులతో, జెండర్లతో 22 ఓట్లు ఉన్నాయి. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు. 5 లక్షలకుపైగా డూప్లికేట్ ఓటర్లు, 93 వేల తప్పుడు చిరునామాలు, 1.24 లక్షల ఫేక్ ఫొటోలు ఉన్న ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం కళ్లముందే ఉంది. ఈసీ వద్ద డూప్లికేట్ ఓట్లు గుర్తించే సాఫ్ట్వేర్ ఉన్నా, బీజేపీకి లబ్ధి చేకూరేలా ఆపరేటెడ్ చేశారు” అని ఆరోపించారు.
“హరియాణాలో మేం గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ 8 సీట్లలో కేవలం 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. మొత్తంగా 1.18 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇది ఓట్ల చోరీ ఫలితం తప్ప మరేం కాదు. బీజేపీ నేతల ఇళ్లలో 66, 108, 501 ఓట్లు నమోదయ్యాయి. అంతమంది అక్కడ లేరు. అయినా ఈసీ తనిఖీ చేయలేదు. ఇళ్లు లేని ఓటర్లకు ‘ఇంటి నంబర్ -0’ ఇచ్చారని ఈసీ చెబుతోంది. కానీ మేము పరిశీలించగా వారికి ఇళ్లు ఉన్నాయని తేలింది” అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
రాహుల్ గాంధీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఆయన బీజేపీకి సహకరిస్తున్నారు. హరియాణాలో ఎన్నికల ముందు 3.5 లక్షల ఓట్లు ఎలాంటి తనిఖీ లేకుండా తొలగించారు, వారిలో చాలా మంది కాంగ్రెస్ మద్దతుదారులే,” అని అన్నారు. యూపీ, హరియాణాలో ఒకేసారి ఓటు వేసిన వేలాది మంది ఉన్నారని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని రాహుల్ గాంధీ విమర్శించారు.








