తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఎంపీ ప్రధాన ఆదాయం పేకాట అని, ఆయన అండతో తిరువూరులో గంజాయి యధేచ్ఛగా వ్యాపారం అంటూ సంచలన ఆరోపణలతో పార్టీ పరువును బజారుకీడ్చాడు కొలికపూడి. దీంతో వీరిద్దరి మధ్య వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వీరి పంచాయితీ జరగనుంది.
ఇటీవల కొలికపూడి శ్రీనివాసరావు మీడియా ఎదుట చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికల సమయంలో టికెట్ కోసం రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడని, అందుకు సంబంధించి బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా విడుదల చేసి టీడీపీకి షాకిచ్చాడు. అంతేకాకుండా, పేకాట, ఇసుక, గంజాయి, లిక్కర్ దందాల్లో కేశినేని చిన్ని పాత్ర ఉందని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వందలాది యువతను మోసం చేశాడని ఆరోపించారు. ఈ కేసులో బాధిత తల్లిదండ్రులు ఇప్పటికీ హైదరాబాదులో ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇక హైదరాబాదులోని ప్రగతినగర్‌లో ఇళ్ల స్థలాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశాడని కేశినేని చిన్నిపై కొలికపూడి ఆరోపణలు కొనసాగించారు. ఈ ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఏ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే అంశాన్ని సొంత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల పంచాయితీ బహిర్గతం చేసిందని అధికార పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకున్న విషయం తెలిసిందే.
దీంతో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వైరం పార్టీ ఇమేజీకి డ్యామేజీ చేస్తోందని గ్రహించిన అధిష్టానం క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది కొలికపూడి మూడోసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడం. తిరువూరు నియోజకవర్గంలోనే ఎప్పుడూ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటూ పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. ఇద్దరు నేతల నుంచి వివరణలు తీసుకున్న తర్వాత కమిటీ పూర్తి నివేదికను పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు సమర్పించనుంది. ఈ పంచాయితీ ఫలితంగా టీడీపీ అంతర్గత విభేదాలు మరింత ముదురుతాయా? లేక పార్టీ అధినేత జోక్యంతో సర్దుబాటు అవుతాయా? అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.








