తిరుపతి (Tirupati) వెంకటేశ్వరస్వామి (Venkateswara Swami) పేరును రాజకీయాల కోసం వాడుకోవడం వల్లే రాష్ట్రంలో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ (Pothina Mahesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రవర్తించారని ఆరోపించారు. లడ్డూ (Laddus)లో కల్తీ నెయ్యి (Adulterated Ghee) అంటూ దేవుడి పేరునే రాజకీయాల కోసం వాడుకోవడం వల్లే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోపం రాష్ట్రంపై పడుతోందని వ్యాఖ్యానించారు.
పోతిన మహేష్ మాట్లాడుతూ.. ఇటీవల తిరుపతి (Tirupati), సింహాచలం (Simhachalam), కాశీబుగ్గ (Kasibugga) వంటి ప్రముఖ దేవాలయాల్లో(Temples) జరిగిన దుర్ఘటనలు యాదృచ్ఛికం కాదని, ఇవన్నీ “దైవ సంకేతాలు”గా భావించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు, సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో గోడ కూలి ఏడుగురు, ఇక తాజాగా కాశీబుగ్గలో తొక్కిసలాటలో పది మంది మరణించడం ఈ మాటకు నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు కల్తీ లడ్డూ వ్యాఖ్య చేసిన తర్వాతనే తిరుపతి ఘటన, సిట్ వేసిన తర్వాత సింహాచలం ఘటన, మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని ఇరికించాలనుకోగానే కాశీబుగ్గ ఘటన జరిగిందని విమర్శించారు.
అలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యం కూడా ఈ దుర్ఘటనలకు కారణమని వైసీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. భక్తుల రద్దీ గురించి ముందే సమాచారం ఉండి కూడా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు కేవలం రాజకీయ ఆదేశాలకే కట్టుబడి ఉన్నారని, ప్రజల ప్రాణాల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారిని “ప్రభుత్వ మరణాలుగా” పరిగణించి, బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.








