ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను “మొంథా తుఫాన్” (Montha Cyclone) ముప్పు మేఘాల్లా కమ్మేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం (Bay-of-Bengal)లో కొనసాగుతున్న వాయుగుండం (Low-Pressure-System) వేగంగా బలపడుతూ దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం, మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా, ఈ సాయంత్రానికి తుఫానుగా, రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రస్తుతం తుఫాన్ కేంద్రం పోర్ట్ బ్లెయిర్‌కి 550 కి.మీ, చెన్నైకి 850 కి.మీ, విశాఖపట్నంకి 880 కి.మీ, కాకినాడకి 880 కి.మీ, గోపాల్‌పూర్‌కి 960 కి.మీ దూరంలో ఉందని సమాచారం. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మంగళవారం రాత్రి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడ (Kakinada) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) వెల్లడించారు.
తీరం దాటే సమయానికి గాలి వేగం 90–110 కి.మీ. వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ, రాజమహేంద్రవరం, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు, గాలివానలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
అధికార యంత్రాంగం అప్రమత్తం
తుఫాన్ దృష్ట్యా ప్రభుత్వం అన్ని శాఖలను హై అలర్ట్‌లో ఉంచింది. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించి, సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించమని సూచించారు. 30వ తేదీ వరకు ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేయబడ్డాయి. ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేయబడింది, సముద్రంలో కార్తీక స్నానాలు చేయరాదని ప్రజలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. “అత్యవసర పనులకు తప్ప బయటకు వెళ్లవద్దు, తీరప్రాంతాలకు వెళ్లడం పూర్తిగా రద్దు చేసుకోండి. మత్స్యకారుల వేటకు వెళ్లొద్దు” అని విజ్ఞప్తి చేశారు.







