బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. ఆ 13 నిమిషాల్లో ఏం జరిగింది..?

బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజీలో షాకింగ్ విష‌యాలు

కర్నూలు (Kurnool) జిల్లా కల్లూరు (Kalluru) మండలం చిన్నటేకూరు (Chinnatekur) సమీపంలో జరిగిన కావేరి ట్రావెల్స్ (Kaveri Travels) బస్సు ప్రమాదం (Bus Accident) ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందగా, తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీతో పోలీసుల దర్యాప్తు మరో దిశగా మలుపు తిరిగింది.

పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజీతో కీలక ఆధారాలు
అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున 2:22:50 నిమిషాలకు పెద్దటేకూరు–చిన్నటేకూరు (Peddatekur-Chinnatekur) మధ్య జాతీయ రహదారి పక్కన ఉన్న హెచ్‌పీసీఎల్ (HPCL) పెట్రోల్ బంక్‌ (Petrol Bunk) వద్ద శివశంకర్ (Shivashankar) అనే యువకుడు తన స్నేహితుడు ఎర్రి స్వామి (Erri Swami)తో కలిసి బైక్‌పై వచ్చాడు. అక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకున్న తర్వాత 2:26 నిమిషాలకు వెళ్లిపోయాడు.

ఈ ఇద్దరూ మొత్తం నాలుగు నిమిషాల పాటు పెట్రోల్ బంక్‌లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తోంది. ఈ ఘటన తరువాత సరిగ్గా 13 నిమిషాల వ్యవధిలో, అంటే 2:39:50 సెండ్ల‌కు ఆ ప్రాంతం గుండా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పాస్ అయింది. ఈ పెట్రోల్ బంక్‌ నుండి ప్రమాద స్థలం కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

ప్రమాదానికి ముందు ఏమి జరిగింది?
శివశంకర్‌ బైక్‌పై నుంచి కిందపడిపోయాడా? లేక మరే వాహనం ఢీకొట్టి పారిపోయిందా? అనేది అనుమానం. స్థానికుల సమాచారం ప్రకారం బస్సు నేరుగా బైక్‌ను ఢీకొట్టలేదని, ప్రమాదానికి ముందు బైక్ ఇప్పటికే రోడ్డుపై పడిఉందని ఈ రెండు వెహికిల్స్ మ‌ధ్య ఉన్న టైమ్‌ డిస్టెన్స్ ఆధారంగా అర్థం అవుతోంది. బైక్ రోడ్డుపై ఉండగా కావేరి ట్రావెల్స్ బస్సు దానిని ఈడ్చుకుంటూ సుమారు 300 మీటర్ల దూరం వెళ్ళిందని, దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు. ఇదే మంటలు బస్సును పూర్తిగా చుట్టేసి, భారీ ప్రాణ నష్టం కలిగించాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

దర్యాప్తులో ఉన్నతాధికారులు
డీఐజీ, ఎస్పీలు ఇప్పటికే ఘటన స్థలాన్ని సందర్శించి, కొత్త సాక్ష్యాల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఎర్రి స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. నిన్న చెప్పిన “బస్సు బైక్‌ను ఢీకొట్టింది” అన్న వాద‌న ఇప్పుడు మారే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment