తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్: సీఎం

తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్.. శాంతిభద్రతల పరిరక్షణలో ముందున్నారు: సీఎం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడని పోలీసుల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

దేశవ్యాప్తంగా 194 మంది, తెలంగాణలో ఆరుగురు అధికారులు అమరులయ్యారని చెబుతూ, నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల తరపున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మూడు రోజుల క్రితం మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ, వారికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా, బలిమెల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలాన్ని ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని కొనియాడిన ముఖ్యమంత్రి, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగకుండా చూశారని ప్రశంసించారు. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించవద్దని ఆదేశించారు. కొత్త తరహా నేరాలు, ముఖ్యంగా సైబర్ క్రైమ్‌ను ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అగ్ర నాయకులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఏడుగురు మహిళా అధికారులను చూసి రాష్ట్రం గర్విస్తోందని పేర్కొంటూ, పోలీసులు ప్రతిక్షణం విరామం లేకుండా పనిచేస్తూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యలలో భాగంగా 16 వేల మంది కానిస్టేబుల్, ఎస్ ఐ లను నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. సామర్థ్యాన్ని బట్టి పోస్టింగ్‌లు ఇస్తున్నామని, రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా విధి నిర్వహణ చేసుకునేలా పరిస్థితులు కల్పించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల ఎక్స్‌గ్రేషియాను పెంచుతూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ ఐలకు కోటి రూపాయలు, ఎస్‌ఐ నుంచి సీఐల వరకు రూ. కోటి 25 లక్షలు, డీఎస్పీ నుంచి ఎస్పీ వరకు రూ. కోటిన్నర, ఆ పై స్థాయి అధికారులకు రూ. రెండు కోట్లు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment