దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతూ వస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు విజయాలు సాధించలేకపోయిన నేపథ్యంలో ఈవీఎంల విషయంపై మరింత చర్చ జరుగుతోంది.
ఈవీఎంలపై జగన్, శరద్ పవార్ అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఈవీఎంల పనితీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల విజయంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారని, కానీ భారత్లో ఎందుకు ఈవీఎంలను ఉపయోగిస్తున్నారనేది ఒక కీలక ప్రశ్న అని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజలలో నమ్మకం లేకపోయినప్పటికీ, ప్రజలు మాత్రం ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ, వారి ఓట్లను వినియోగిస్తున్నారని చెప్పారు. శరద్ పవార్ చెప్పినట్లుగా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలు బ్యాలెట్లు వాడుతున్నాయి, అయితే మన దేశంలో ఎందుకు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారనేది ప్రజల్లో మెలుగుతున్న ప్రశ్న.